కామారెడ్డి, ఏప్రిల్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి అగ్నిమాపక కేంద్రంలో గురువారం అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మంటలను ఆర్పడానికి కృషి చేస్తారని తెలిపారు.
పెద్ద భవనాల నిర్మాణంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈనెల 14 నుంచి 20 వరకు జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారని చెప్పారు. ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే 101 కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బహుమతులను ప్రధానం చేశారు.
జిల్లా ఫైర్ అధికారి సయ్యద్ మహమూద్ అలీ, ఫైర్ ఆపరేటర్ రవీందర్ రెడ్డి, ఉద్యోగులు సాయిలు, లక్ష్మణ్, శ్రవణ్ కుమార్, సాయిబాబా, వెంకటి, శేఖర్, రమేష్ పాల్గొన్నారు.