హైదరాబాద్, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంస్కృతాంధ్ర సవ్యసాచి, భాషా వేత్త, రచయిత, ఆచార్య రవ్వా శ్రీహరి (79) అస్వస్థతతో శుక్రవారం రాత్రి 10:30 గంటలకు హైదరాబాదులో కన్నుమూశారు. నేటి యాదాద్రి భువనగిరి జిల్లా మునిపంపుల గ్రామంలో అమ్మమ్మ గారి ఇంట 7 సెప్టెంబర్ 1943న జన్మించిన శ్రీహరి తల్లిదండ్రులు వెల్వర్తి,కి చెందిన రవ్వా వెంకట నరసమ్మ ,వెంకట నరసయ్య.
మునిపంపులలో ప్రాథమిక విద్య నుండి హైదరాబాద్ వరకు సాగిన వీరి విద్యాభ్యాసంలో ఎం ఏ తెలుగు, సంస్కృతంలో పట్టభద్రుడు అయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘‘భాస్కర రామాయణం విమర్శనాత్మక పరిశీలన’’ అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేటు పొందారు. ఉద్యోగరీత్యా హైదరాబాదులోని ఉస్మానియా, కేంద్రీయ, విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఆచార్యునిగా, ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పంలో ఉపకులపతి గా విశేషమైన సేవలు అందించి ఎందరో పరిశోధక విద్యార్థులకు మార్గదర్శిగ నిలిచారు.
రచయితగా తెలుగులో… తెలుగు కవులు సంస్కృతానుకరణలు, సంకేత పదకోశం, తెలంగాణ మండలికాలు -కావ్య ప్రయోగాలు, తెలుగులో అలబ్ద వాఙ్మయము, ఉభయ భారతి, సంస్కృత వైజయంతి, సంస్కృత సూక్తి రత్నావళి, అన్నమయ్య భాషా వైభవం, వంటి ప్రామాణిక రచనలు చేశారు. ప్రపంచపదులు, గబ్బిలం, పిరదౌసి, వేమన, నరసింహ శతకాలను సంస్కృతంలోకి అనువదించారు. అనేక అనువాద రచనలు చేసిన ఈ నిత్య అధ్యయనశీలి, నిగర్వి, శ్రీహరి మరణం పట్ల తెలుగు సాహితీ లోకం అక్షర నివాళులు అర్పించింది.