హైదరాబాద్, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వడగండ్ల వాన, అకాల వర్షాలతో చేతి కొచ్చిన పంట నష్ట పోవడం ఎంతో బాధాకరం, దురదృష్టకరం అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
రైతన్నలారా దిగులు చెందకండి.. వెంటనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించమని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చామని, ఇప్పటికే వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వివరాలు సేకరిస్తున్నారని మంత్రి రైతులకు భరోసా కల్పించారు. రేపటి వరకు పూర్తి వివరాలు తెప్పించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయానా రైతు కాబట్టి ఇటువంటి సందర్భంలో రైతుల మనో వేదనను ఆయన అర్థం చేసుకుంటారు అనే పూర్తి నమ్మకం తనకు ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.