కామారెడ్డి, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మే 31 లోపు మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పాఠశాల భవనాల నిర్మాణం పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్య ,సంక్షేమ, మౌలిక వసతుల సమస్త చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో మన ఊరు- మనబడి కింద చేపడుతున్న పాఠశాల భవనాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పాఠశాల భవనాల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అన్ని భవనాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా చూడాలన్నారు. కామారెడ్డి జిల్లాలోని 23 మండలాల్లో నిర్మిస్తున్న భవన నిర్మాణాల పురోగతిపై మండలాల వారిగా ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, వంటశాలలు, రక్షణ గోడ నిర్మాణం పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు.
పనులు నాణ్యతగా జరిగే విధంగా చూడాలని తెలిపారు. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.