కామారెడ్డి, ఏప్రిల్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రహదారి భద్రత నియమాలు పాటించడం అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ఉపయోగించాలని తెలిపారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే స్థలాల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి అక్కడ జరిగిన ప్రమాదాల్లో గత ఏడాదిగా మృతి చెందిన వారి సంఖ్యను తెలియజేయాలని సూచించారు.
అన్ని పోలీస్ స్టేషన్లో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రామాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ద్విచక్ర వాహనాలు అతివేగంగా నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రోడ్డుపై ఉన్న వేగ పరిమితికి అనుగుణంగా వాహనాలు నడిపి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ప్రజలను కోరారు. సమావేశంలో జిల్లా రవాణా అధికారిని వాణి, జాతీయ రహదారి అధికారులు, ఆర్ అండ్ బి, మున్సిపల్, వైద్య శాఖల అధికారులు పాల్గొన్నారు.