నిజామాబాద్, ఏప్రిల్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జీఓ నెం.58, 59 ద్వారా అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు ఈనెల 30 వ తేదీ నాటితో గడువు ముగియనుందని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు నిర్ణీత గడువులోగా మీ సేవా ద్వారా దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58, 59 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీ కరణకు 2014 జూన్ 02 కటాఫ్ తేదీ ఉండగా, దానిని 2020 జూన్ 02 కు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల మార్చి 17వ తేదీన ఉత్తర్వుల సంఖ్య 29ను జారీ చేసి, నూతనంగా భూ క్రమబద్దీకరణకు దరఖాస్తు లు చేసుకునేందుకు ప్రస్తుత ఏప్రిల్ మాసం 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించిందని, మీ సేవా ద్వారా గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, ఇంటి పన్ను రసీదు, కరెంట్ బిల్ తదితర డాక్యుమెంట్లు అవసరమని ఆయన సూచించారు.