నిజామాబాద్, ఏప్రిల్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి పథకం – తయారీ సంస్థలు క్రమబద్ధీకరణ కింద జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వాలు వివిధ పథకాల కింద అందిస్తున్న తోడ్పాటు గురించి ఈ సందర్భంగా ఔత్సాహికులకు వివిధ శాఖల అధికారులు అవగాహన కల్పించారు.
బ్యాంకుల నుండి సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం పొందేందుకు కనీస అర్హతలు, విధివిధానాల గురించి తెలియజేశారు. సూక్ష్మ పరిశ్రమల స్థాపన కోసం ఉపయుక్తంగా నిలిచే అధునాతన యంత్ర పరికరాల గురించి ఈ ప్రదర్శనలో ప్రయోగాత్మకంగా వివరించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ చందర్ మాట్లాడుతూ, వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనందున నిజామాబాద్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా దేశంలోనే అత్యధికంగా జిల్లాలో పసుపు పంటను సాగు చేస్తారని, ఈ నేపథ్యంలో పసుపు ఆధారిత యూనిట్లను నెలకొల్పేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని సూచించారు.
అర్హులైన వారికి ప్రభుత్వం 35 శాతం సబ్సిడీతో కూడిన రుణాన్ని మంజూరు చేస్తుందన్నారు. ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద తోడ్పాటును అందిస్తున్నాయని సూచించారు. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పరిశ్రమలను విరివిగా ఏర్పాటు చేసినట్లయితే అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రజలకు కూడా ఆహార ఉత్పత్తులు వారి అవసరాలకు సరిపడా అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ సమ్మయ్య, మెప్మా పీడీ రాములు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి తిరుమల ప్రసాద్, నాబార్డు డీజీఎం నాగేష్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.