గొర్రెల పంపిణీ పథకంపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అమలు తీరుపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

రెండవ విడత గొర్రెల పంపిణీ పథకం అమలులో పాటించాల్సిన పద్ధతులు, యూనిట్‌ విలువ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, గొర్రెల సేకరణ, వాటి బీమా, రవాణా, వ్యాధుల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు, ఆదాయం పెంపు మార్గాలు తదితర అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం రెండవ విడతలో 8384 మంది లబ్దిదారులను ఎంపిక చేయాల్సి ఉన్నదని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారుల నుండి వారి వాటాకు సంబంధించిన డీ.డీలు సేకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

మొదటి విడతలో ఒక్కో యూనిట్‌ విలువ లక్షా 25వేల రూపాయలు ఉండగా, దానిని ప్రభుత్వం ప్రస్తుతం లక్షా 75 వేలకు పెంచిందన్నారు. ఇందులో ప్రభుత్వం 75శాతం సబ్సిడీ కింద రూ .1,31,250 లను సమకూరుస్తుండగా, లబ్ధిదారులు తమ వాటాగా 25శాతం నిధులు రూ. 43,750 డీ.డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొటేలు ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని లబ్దిదారులకు వివరిస్తూ, డీ.డీల సేకరణను ముమ్మరం చేయాలని కలెక్టర్‌ సూచించారు. అదేవిధంగా నామినీల వివరాల సేకరణ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ప్రభుత్వం రెండవ విడత గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టే సమయానికే అన్ని ప్రక్రియలను పూర్తి చేసుకుని యూనిట్లు గ్రౌండిరగ్‌ చేసేలా సమాయత్తం అయి ఉండాలన్నారు. మొదటి విడత తరహాలోనే ప్రస్తుతం కూడా జీ.ఓ నెం. 52 ప్రకారం లాటరీ విధానం ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం తాజాగా పలు అంశాల్లో చేసిన మార్పులు, రూపొందించిన నిబంధనలపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకుని, నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. ఇతర ప్రాతాల నుండి గొర్రెలను తీసుకువచ్చే సమయంలో నిబంధనలను పక్కాగా పాటించాలని హితవు పలికారు.

పశుసంవర్ధక శాఖ అధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దార్లతో సమన్వయాన్ని పెంపొందించుకుని, ఈ పథకం అమలులో మండల స్పెషల్‌ ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జగన్నాథ చారి, సహాయ సంచాలకులు బలీగ్‌ అహ్మద్‌, మండల స్పెషల్‌ ఆఫీసర్లు, పశు సంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »