కామారెడ్డి, ఏప్రిల్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విత్తనాల కారణంగా పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతే రైతులు నష్టపరిహారం పొందే వీలుందని హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధా అన్నారు. బిక్కనూర్ రైతు వేదికలో శనివారం అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు చైతన్య సదస్సులో ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడారు. విత్తనాల వల్ల పంట నష్టం జరిగినట్లు రైతులు గుర్తిస్తే విత్తనాల కంపెనీ నుంచి పరిహారం పొందవచ్చని తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో ఇచ్చిన రసీదులు, కొన్ని విత్తనాల శాంపిల్, బ్యాచ్ నెంబర్ వంటి వివరాలను రైతుల వద్ద ఉంచుకొని ఫిర్యాదు చేయాలన్నారు.
పురుగు మందులు పని చేయకపోతే వాటి బిల్లు, కంపెనీ వివరాలు రైతులు తమ వద్ద ఉంచుకొని ఫిర్యాదు చేస్తే తగిన పరిహారం పొందే వీలుంటుందని పేర్కొన్నారు. రైతులు పండిరచిన ధాన్యాన్ని నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు. ధాన్యాన్ని దళారులకు విక్రయించడం వల్ల గిట్టుబాటు ధర రాక రైతులు మోసపోతున్నారని చెప్పారు. సేంద్రీయ పద్ధతిలో రైతులు కూరగాయలు, ధాన్యం పండిరచి ఆన్లైన్ ద్వారా విక్రయిస్తే రైతులు గిట్టుబాటు ధర పొందే వీలుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. రైతులు అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలు వినియోగించుకోవాలని చెప్పారు. అకాల వర్షాల వల్ల జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాల సేకరణ యుద్ద ప్రతిపాదికన చేపడతామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. సమావేశంలో జిల్లా జడ్జి శ్రీదేవి, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ వేణు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, న్యాయమూర్తులు, న్యాయవాదులు, రైతులు పాల్గొన్నారు.