నిజామాబాద్, ఏప్రిల్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో యాసంగి 2022-23 సీజన్‌లో ఇప్పటివరకు 406 కేంద్రాల ద్వారా 20,239మంది రైతుల నుండి 1,64,656 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.
గ్రామ స్థాయిలో పీ.పీ.సి సెంటర్ ఇంచార్జ్‌లను, వ్యవసాయ విస్తీర్ణాధికారులను, మండల స్థాయిలో మండల స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారి, స్థానిక ఎస్.ఐ, ఎం.వీ.ఐ, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, వ్యవసాయ శాఖ ఏ.డీ, ఎం.వీ.ఐ, సూపర్వైజరీ ఆఫీసర్లు, ఏ.సీ.పీ, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు.
రైతులు ఎఫ్.ఏ.క్యూ నిబంధనలకు అనుగుణంగా నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి పూర్తి స్థాయిలో మద్దతు ధర పొందాలని కలెక్టర్ కోరారు. అకాల వర్షాల కారణంగా తడిచిన ధాన్యాన్ని బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపుతూ, తడిచిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలించేలా ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇప్పటివరకు 25 ట్రక్కుల తడిచిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం జరిగిందని, కావున రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా సంయమనం పాటించాలని కోరారు.
ఇదే అదనుగా చూసుకుని కొందరు రైస్ మిల్లర్లు కడ్తా పేరుతో వచ్చినటువంటి ధాన్యాన్ని దించుకోవడానికి ఇబ్బందికి గురి చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ అన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని కడ్తా పేరుతో ఎవరైనా రైస్ మిల్లర్లు దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తే, అలాంటి రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించామన్నారు. ధాన్యం దిగిన వెంటనే మిల్లులో అక్ నాలెడ్జ్ మెంట్ ఇవ్వాలని, పీపీసీ సెంటర్ ఇంచార్జ్‌తో సమన్వయము చేసుకుంటూ కొనుగోళ్లు వేగవంతం చేయాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.
జిల్లాలో అన్ని సెంటర్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. డీ.పీఎంలు ఎంట్రీలను వేగవంతం చేసి రైతుల బ్యాంకు ఖాతాలలో ధాన్యం డబ్బులు జమచేయాలని సూచించామన్నారు. ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు లారీలను పంపిస్తూ ధాన్యం తరలించాలని, ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించామని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్ప్లైస్ డీ.ఎంను ఆదేశించామని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతులకు సూచనలు చేస్తూ, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించామన్నారు. ఏ దశలోనూ రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించామని కలెక్టర్ తెలిపారు.