ఎడపల్లి, మే 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అఖిల భారత రైతు కూలి సంఘం, సీపీఎం, సిఐటియూ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండలకేంద్రంలోని రైతుకూలి సంఘం కార్యాలయం ఎదుట, జంలం, పోచారం, అంబం (వై) గ్రామంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ జండాను ఎగురవేసి కార్మిక పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ.. అమెరికాలోని షికాగోలో 1886లో మే 1 న ప్రారంభించిన కార్మిక పోరాటంలో చాలా మంది కార్మికులు పోలీసుల కాల్పుల్లో మరణించారని అన్నారు. ఈ పోరాటం జరిగి 133 సంవత్సరాలు గడుస్తుందని ఆ ఘటనలో మృతి చెందిన కార్మికుల గుర్తుగా మేడే నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సును పట్టించుకోవడం లేదన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణాను అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, రైతులకు లక్ష రుణమాఫీ, రెండు వేల పెన్షన్ వంటి హామీలు నీటి మూటలుగా మిగిలాయన్నారు. కార్మికుల, కర్షకుల హక్కుల సాధనకు పొరాటమొక్కటే మార్గమని పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల నిర్విరామంగా కురుస్తున్న అకాల వర్షాలతో పంటలు నెలకొరగడమే కాకుండా కోసిన పంటలు మొలకెత్తుతున్నాయని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంటలు నేలపాలవుతున్నాయని, తడిసిన, మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో మల్లేష్, నారాయణ, హన్మాండ్లు, రవి, సుదర్శన్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.