ఎడపల్లి, మే 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగు సంవత్సరాలు ప్రొబేషనరీ కాలం పూర్తయి రెగ్యులరైజేషన్ పై ఎలాంటి ప్రకటన రానందున రాష్ట్రవ్యాప్త జేపీఎస్ ల పిలుపు మేరకు గత నెల 29 తేదీ నుండి నిరవధిక సమ్మెను ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు మండలంలోని జెపిఎస్, ఓపిఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సోమవారం నాటికీ మూడో రోజు సమ్మె కొనసాగుతుంది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నాలుగు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్న వారిని వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని, ఒపీఎస్ నియామక పద్ధతిని రద్దుచేసి వారిని జేపియస్ గా కన్వర్ట్ చేసి దాని ద్వారా వచ్చే వేతనాన్ని అందించాలని ప్రధాన డిమాండ్లతో సమ్మెలో కొనసాగుతున్నామని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో 18 గ్రామ పంచాయతీలకు జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా అవార్డులు వచ్చాయని ఆ అవార్డులు జీపీ సెక్రటరీ ల వల్లనే వచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పడం జరిగిందని రాష్ట్రానికి దేశవ్యాప్తంగా పేరు తెచ్చిన సెక్రటరీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
సమ్మె చేయడం తమ హక్కు కాదని తమ ఆవేదన వ్యక్తం చేయడం మాత్రమే అని అన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన జీవో వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. సమ్మెలో పాల్గొన్న జూనియర్ పంచాయతీ సెక్రటరీల సమ్మెకు ఎంపిఓ సుభాష్ చంద్రబోస్ మద్దతు తెలిపి సంఫీుబావం ప్రకటించారు. కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు రాజేశ్వర్, రాంరెడ్డి, సాయికుమార్, పద్మవతి, స్వర్ణలత, గంగాధర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.