నిజామాబాద్, మే 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని చిన్నాపూర్ వద్ద గల అర్బన్ పార్క్ ను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓ ఎస్ డీ ప్రియాంక వర్గీస్ బుధవారం సందర్శించారు. తుది దశకు చేరిన వివిధ పనులను జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డీఎఫ్‌ఓ వికాస్ మీనాలతో కలిసి పరిశీలించారు. ఓపెన్ జిమ్ లు, ప్లే జోన్ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, రోడ్డు నిర్మాణాలను పరిశీలించి ఫారెస్ట్ అధికారులకు పలు సూచనలు చేశారు.
411ఎకరాల పైచిలుకు విస్తీర్ణంతో కూడిన అటవీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ అర్బన్ పార్కులో సందర్శకుల కోసం 126 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వివిధ రకాల సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని డీ.ఎఫ్.ఓ వికాస్ మీనా సీఎంఓ సెక్రెటరీ, ఓఎస్డీ ల దృష్టికి తెచ్చారు. రూ. 5.58 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పార్కు నిర్మాణంలో ఇప్పటికే రూ.5 కోట్ల విలువ చేసే పనులు పూర్తయ్యాయని తెలిపారు. రోడ్లు, నీటి వసతి, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అయితే, మిగిలి ఉన్న తుదిదశ పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, అర్బన్ పార్క్ ను ప్రారంభోత్సవానికి ముస్తాబు చేయాలని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు.
పార్కులో చెరువులు, నీటి ట్యాంకులు ఉన్నందున సందర్శకుల కోసం బోటింగ్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటవుతున్న ఈ అర్బన్ పార్క్ ను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చూడాలని, ఈ మేరకు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఓపెన్ జిమ్ లు, వాకింగ్, జాగింగ్ ట్రాక్ లు, చిల్డ్రన్స్ ప్లే జోన్ వంటి వసతులు ఉండడం ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని, నిజామాబాద్ జిల్లా కేంద్రానికి అతి చేరువలో ఉండడంతో అన్ని వర్గాల ప్రజలకు ఈ పార్కు సందర్శన సౌలభ్యంగా ఉంటుందన్నారు.
ప్రత్యేకించి యువత, విద్యార్థులు పార్కును సందర్శించేలా చూడాలని, పోలీసు సిబ్బంది కూడా తమ శారీరక దారుఢ్యం కాపాడుకునేందుకు అర్బన్ పార్క్ ఉపయుక్తంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్క్ ను ప్రజలు తమ సొంత ఆస్తిగా భావిస్తూ, ఇక్కడి సదుపాయాలను పరిరక్షించుకోవాలని హితవు పలికారు. ప్రకృతిపరంగా సహజ సిద్ధంగా వెలసిన తరహాలో సందర్శకుల కోసం పలు ఏర్పాట్లు చేయడం పట్ల అటవీ అధికారులు, సిబ్బందిని అభినందించారు. చిల్డ్రన్స్ పార్క్ లో వసతులను చూసి ముగ్ధులయ్యారు.
పార్కు ప్రధాన మార్గంతో పాటు మెయిన్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వారికి అర్బన్ పార్కు ఆకర్షించేలా అందంగా తీర్చిదిద్దడం, అందమైన పూల మొక్కలు, ఆకట్టుకునే పెయింటింగ్స్ వేయించడం పట్ల అభినందించారు. ప్రవేశ ద్వారం నుండి నలువైపులకి వెళ్లే మార్గాలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు.
అందమైన పూల మొక్కలతో పాటు అన్ని రకాల మొక్కలను పెంచాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఉండే మొక్కలన్నీ అర్బన్ పార్క్ లో ను కనిపించాలన్నారు. అర్బన్ పార్కుకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం అవసరమైన సదుపాయాలన్నీ నెలకొల్పాలని సూచించారు. వీరి వెంట డీపీఓ జయసుధ, ఎఫ్‌డీఓ భవాని శంకర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.