బాన్సువాడ, మే 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకున్న రైస్ మిల్లర్లు తరుగు పేరిట అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తున్నామని చెప్పి రైతుల జీవితాలతో నాటకమాడుతున్నారన్నారు.
కోటగిరి మండలంలో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన నిర్వాహకులు దాన్ని కొనుగోలు చేపట్టడం లేదని రైతులు తమ గోడును ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిరదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు బస్తాకు కిలో చొప్పున తరువు పేరిట ఇచ్చిన రైస్ మిల్లర్లు క్వింటాలుకు నాలుగు, ఐదు కిలోలు తరుగు పేరిట రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని, అధికార పార్టీ నాయకులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై దందా కొనసాగిస్తున్నారన్నారు. రైతులను ఆదుకుంటామని చెబుతున్న నాయకులు రైతులని నట్టేట ముంచుతున్న సంబంధిత అధికారులు సెలవుల్లో ఉండడం అధికారులు అధికార పార్టీ నాయకుల మధ్య అనుబంధం ఎటువంటిదో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందన్నారు.
కోటగిరి మండల కేంద్రంలోని సాయి అగ్రోస్ రైస్ మిల్లు వద్ద మూడు రోజుల నుండి లారీలో ధాన్యాన్ని తరుగు తీస్తున్నామని రైసుమిల్లర్లు చెప్పడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. మండలంలోని ధర్మకాంట వద్ద తూకంలో తేడా వచ్చిందని గుర్తించిన ఇప్పటివరకు నిర్వాహకులపై చర్యలు చేపట్టకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తూ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో అధికారిలు చర్యలు చేపడితే వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల నుండి రైతుల ధాన్యాన్ని తరలించాలని తరుగు పేరిట మోసం చేస్తున్న రైస్ మిల్లర్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులు నష్టపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్ దేశాయ్, పార్టీ అధ్యక్షుడు షాహిద్, ఎంపిటిసి కొట్టం మనోహర్, మాజీ జెడ్పిటిసి పొతంగల్ మండల అధ్యక్షుడు పుప్పల శంకర్, పట్టణ అధ్యక్షుడు అయుబ్, హైమద్, హనుమంత్, గోవిందరావు, సాయిలు, భూమన్న, ఖయ్యూం, హనుమంత్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.