ఎడపల్లి, మే 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 6 రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె ఎడపల్లి మండలంలో కొనసాగుతుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ పూర్తిగా మద్దతు తెలిపారు. జేపీఎస్ సమ్మె ఆరో రోజు చేరుకున్న కూడా ప్రభుత్వము స్పందన లేకుంటా అయిందని వెంటనే జూనియర్ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జంగం గంగాధర్ డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వము జూనియర్ కార్యదర్శులతో వెట్టిచాకిరి చేయిస్తుందని, వెంటనే జూనియర్ కార్యదర్శులను ఓపీఎస్ ను వెంటనే అమలు చేయాలని అన్నారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో జేపీఎస్ సెక్రటరీలు 994 మంది ఈరోజు రోడ్ పైకి రావడం జరిగిందని అన్నారు. వెంటనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి నాయకత్వంతో చర్చలు జరిపి కార్యదర్శులు కోరిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
లేనియెడల గ్రామపంచాయతీ సిబ్బంది మొత్తం రాష్ట్రంలో 46వేల మందిని తమ ఆధ్వర్యంలో వారికి మద్దతు తెలుపుతూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎడపల్లి, మంగల్పాడ్, వడ్డేపల్లి, ధర్మారం, బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.