నిజామాబాద్, మే 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించిన బిల్లులను సత్వరమే చెల్లించేందుకు చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్ సమీక్ష నిర్వహించారు.
డబుల్ బెడ్ రూమ్ పథకంతో పాటు కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఎరువుల నిల్వలను సమకూర్చుకోవడం, జీ.ఓ నెం.లు 58 , 59 , 76, 118 అమలు, ఆయిల్ పామ్ లక్ష్య సాధన తదితర అంశాల ప్రగతిని సమీక్షిస్తూ సూచనలు చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రైతుల నుండి సేకరించి, పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో బిల్లులు జమ చేసే విషయంలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ విషయమై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందిస్తూ, జిల్లాలో ఇప్పటివరకు సుమారు రూ. 600 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశామని, అందులో రూ. 150 కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని సీ.ఎస్ దృష్టికి తెచ్చారు. ధాన్యం తరలించే వాహనాల రిజిస్ట్రేషన్ అంశాన్ని సైతం ఈసారి కొత్తగా ఓ.పీ.ఎం.ఎస్ నిబంధనల్లో చేర్చడం వల్ల బిల్లుల చెల్లింపుల్లో కొంత జాప్యం జరుగుతోందన్నారు. వచ్చే వారం నాటికి పెండిరగ్ బిల్లుల చెల్లింపులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. కాగా, రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని నిర్దిష్ట గడువులోగా మిల్లింగ్ జరిపి పౌర సరఫరాల శాఖకు బియ్యం నిల్వలు చేరవేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పది రోజుల వ్యవధిలో కనీసం యాభై శాతం బియ్యం నిల్వలను పౌర సరఫరాల శాఖకు రైస్ మిల్లర్లు చేరవేసేలా చూడాలని గడువు విధించారు. ఆరోగ్య మహిళా, కంటి వెలుగు కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందని, వీటి ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలందేలా చొరవ చూపాలని సీ.ఎస్ సూచించారు. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమం 69 రోజులు పూర్తి చేసుకుందని, ఇదే తరహాలో మిగిలిన 31 రోజుల పాటు శిబిరాలను పకడ్బందీగా నిర్వహిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణీ త్వరగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు.
ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు వినియోగించుకునేలా చూడాలని, ఈ కార్యక్రమం అమలవుతున్న ఆసుపత్రులను క్రమం తప్పకుండా సందర్శిస్తూ అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.