నిజామాబాద్, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల ద్వారా పంపించే ధాన్యాన్ని వెంటనే అన్ లోడిరగ్ చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైస్ మిల్లర్లకు హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రైస్ మిల్లర్లు తమ డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తమకు కేటాయిస్తే నష్టాలను చవిచూడాల్సిన ప్రమాదం ఉన్నందున ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు వెనుకంజ వేస్తున్నామని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మన జిల్లాలో ధాన్యం అన్లోడిరగ్ ను నిలిపివేస్తే రైతులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందన్నారు. స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితి గురించి ఉన్నతాధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లామని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం వారు రైస్ మిల్లర్లతో సోమవారం చర్చించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని అన్నారు.
కావున ధాన్యం నిల్వలను యధావిధిగా అన్లోడిరగ్ చేసుకోవాలని, రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని కలెక్టర్ రైస్ మిల్లర్లకు సూచించారు. ప్రకృతి పరంగా తలెత్తిన ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. కలెక్టర్ సూచనకు రైస్ మిల్లర్లు సానుకూలంగా స్పందిస్తూ, యధావిధిగా ధాన్యం దిగుమతి చేసుకునేందుకు అంగీకారం తెలిపారు.