ఆర్మూర్, మే 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన కుర్మ కర్రోళ్ల అనిల్ గొర్రెలు మేపడానికి అడవికి వెళ్ళాడు. మధ్యాహ్నం ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో అనిల్ గొర్రెలను అన్నిటినీ చెట్టు కిందికి తోలాడు. హఠాత్తుగా ఆ చెట్టుపై పిడుగు పడడంతో 48 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అక్కడే ఉన్న అనిల్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ బుధవారం భీంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిల్‌ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు. వారి కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వం వెంటనే అనిల్ కుటుంబాన్ని ఆదుకోవాలని నష్టపోయిన గొర్రెల విలువ 5 లక్షల పైనే ఉంటుందని ఆయన అన్నారు. మండల అధికారులు సర్వేలకే పరిమితం అవుతున్నారని అసలు ఇలాంటి కుటుంబాలకు ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట సునీల్ సేన సభ్యులు ఉన్నారు.