నిజామాబాద్, మే 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మే 31న హరిదా రచయితల సంఘం నిర్వహించనున్న సాహిత్య మహాసభ విజయవంతం కావాలని శాసనమండలి సభ్యులు, భారత్ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. బుధవారం అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రజల చైతన్యంలో సాహితీవేత్తల పాత్ర గణనీయమైనదని అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘‘సామరస్య జీవనములో సాహిత్య వేత్తల కర్తవ్యం’’ అనే థీమ్‌పై జరిగే ఈ కార్యక్రమంలో సాహితీవేత్తల సందేశాలు, ప్రముఖ గజల్ కవి, గీత రచయిత వి నరసింహారెడ్డికి తెలంగాణ విశిష్ట సాహిత్య పురస్కార ప్రదానం, జిల్లాస్థాయి హరిదా సాహిత్య పురస్కారాల ప్రదానం, సంగీత విభావరి, కవిసమ్మేళనం తదితర కార్యక్రమాలు ఉంటాయని, కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ ఆత్మీయ అతిథిగా పాల్గొంటారని హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ వివరించారు.
కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు, నరాల సుధాకర్, తిరుమల శ్రీనివాస్, గంట్యాల ప్రసాద్, గుత్ప ప్రసాద్, మద్దుకూరి సాయిబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.