నిజామాబాద్, మే 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల నుండి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్నివెంటదివెంట తరలించడంతో పాటు, తక్షణమే మిల్లుల వద్ద అన్ లోడిరగ్ జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సూచించారు.
జిల్లాలో ఉన్న రైస్ మిల్స్ ని 60 క్లస్టర్ లుగా విభజించాలని, వాటికి 60 మంది జిల్లా స్థాయి అధికారులను నియమించి ప్రతి రోజు ధాన్యం అన్లోడ్ అయ్యేలా పర్యవేక్షించాలన్నారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం సేకరణ స్థితిగతులపై సమీక్షించారు. ప్రధానంగా రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలతో కూడిన వాహనాలు ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గుండారం లోని జైగణేష్ ప్యాడీ ప్రాసెస్సింగ్ ఇండస్ట్రీస్, శ్రీ ధనలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీ కృష్ణ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీనగర్ లోని శ్రీలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్, ఖానాపూర్ లోని శ్రీ పాండురంగ రైస్ మిల్, కాలూర్ లోని శ్రీ అయ్యప్ప ఇండస్ట్రీస్, బర్దిపూర్ లోని శ్రీ చక్ర ఇండస్ట్రీస్, బోర్గం లోని శ్రీ లక్ష్మీనారాయణ రైస్ ట్రేడర్స్ లలో ఎక్కువ మొత్తంలో ధాన్యం ఆన్ లోడిరగ్ కాలేదని, ఈ రైస్ మిల్లులను సందర్శించి పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించాలని ఆర్డీఓ లను ఆదేశించారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకునేందుకు వీలుగా అవసరమైతే ఎక్కువ మొత్తంలో గోడౌన్లను గుర్తించాలని, సరిపడా హమాలీలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 218 రైస్ మిల్లులకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం పంపిస్తున్నామని, వీటిలో 123 రా రైస్ మిల్లులు ఉండగా, మరో 95 బాయిల్డ్ రైస్ మిల్లులకు ఇటీవల కురిసిన ధాన్యాన్ని పంపుతున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంత్రి దృష్టికి తెచ్చారు. అయితే గత సంవత్సరం 6.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈసారి 7 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం సేకరించాల్సి ఉన్నందున కొనుగోలు ప్రక్రియలో ఎక్కడ కూడా జాప్యం జరుగకుండా పకడ్బందీగా వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు. ప్రధానంగా రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలు వెంటదివెంట అన్‌లోడ్ జరగాలన్నారు.
ఈ మేరకు ఒక్కో రైస్ మిల్లు వద్ద వాహనాలు ఎంత సమయం పాటు నిలిచి ఉంటున్నాయన్నది రోజువారీగా గమనిస్తూ, అన్ లోడిరగ్లో తీవ్ర జాప్యం జరుగుతున్న చోట అందుకు గల కారణాలను అన్వేషిస్తూ పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. ధాన్యం రవాణా కోసం వినియోగిస్తున్న 800 లారీలు ధాన్యం సేకరణ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయా లేదా అన్నది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల ద్వారా పరిశీలన జరిపించాలని డీటీసీ ని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులకు గురికాకూడదని, నిర్ణీత గడువు లోపు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేందుకు అధికారులందరూ ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొసైటీల చైర్మన్లకు, రైస్ మిల్లర్లకు, ట్రాన్స్ పోర్ట్ వాహనాల కాంట్రాక్టర్ లకు అధికారుల సమక్షంలోనే ఫోన్ ద్వారా సంప్రదించి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి గురించి వాకబు చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా కేటాయించిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు అదనంగా గిడ్డంగుల అవసరం ఉన్నదని రైస్ మిల్లర్లు తెలుపగా, ఈ మేరకు గోడౌన్లను తక్షణమే గుర్తించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈసారి పెద్ద మొత్తంలో ధాన్యం దిగుమతులు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నందున వెంటదివెంట అన్ లోడిరగ్ చేసుకునేలా సన్నద్ధమై ఉండాలని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగేందుకు అన్ని విధాలుగా సహకరించాలని రైస్ మిల్లర్లకు హితవు పలికారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, డీ.ఎస్.ఓ చంద్రప్రకాష్, మెప్మా పీ.డీ రాములు, సివిల్ సప్ప్లైస్ జిల్లా మేనేజర్ జగదీశ్, డీసిఓ సింహాచలం, డీటీసి వెంకటరమణ, ఆర్డీఓలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, వ్యవసాయ, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.