ధాత్రి టౌన్‌ షిప్‌లో పనులు వేగవంతం

నిజామాబాద్‌, మే 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌ లో మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధాత్రి టౌన్‌ షిప్‌ లో ప్లాట్ల విక్రయాల కోసం ఇప్పటికే రెండు విడతలుగా వేలం ప్రక్రియలు నిర్వహించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ధాత్రి టౌన్‌ షిప్‌లో అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

ఇందులో భాగంగానే గురువారం కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌ లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ధాత్రి టౌన్‌ షిప్‌ లో పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. ఇప్పటికే రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు, నీటి వసతి, విద్యుద్దీకరణ, ఎస్‌.టీ.పీ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా విద్యుద్దీకరణ, నీటి వసతి పనులకు అధిక ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు.

ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకుల నిర్మాణాలను తక్షణమే ప్రారంభించాలన్నారు. సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ కు సంబంధించి అధునాతన టెక్నాలజీని అనుసరిస్తూ నిర్మాణం చేపట్టేందుకు వీలుగా సంబంధిత కంపెనీల ప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ఇప్పటికే వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను వేగవంతం చేయాలని, విరామం లేకుండా పనులు జరిగేలా చూడాలన్నారు. యూజీడీ తదితర పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి సకాలంలో పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పనుల పూర్తికి చొరవ చూపాలన్నారు. సమావేశంలో టీఎస్‌ఐఐసి ప్రతినిధులు రాందాస్‌, దినేష్‌, ట్రాన్స్‌ కో ఎస్‌.ఈ రవీందర్‌, నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ అనిల్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకుడు సూర్య, వివిధ విభాగాలకు చెందిన ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »