ఆర్మూర్, మే 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామపంచాయతీ జూనియర్ కార్యదర్శులను ఉద్యోగాల నుండి తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 15 రోజులుగా సమ్మె చేస్తుంటే చెవిటి వానిలా ప్రవర్తించిన ప్రభుత్వం బెదిరింపులతో ఉద్యమాన్ని అణిచి వేయాలని చూడడం అవివేకమని ఆయన అన్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యల్ని పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు డిమాండ్ చేశారు. విధులకు చేరకపోతే ఉద్యోగులను తొలగిస్తామని జీవో జారీ చేయటాన్ని భారత ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందనీ తెలిపారు. కార్యదర్శులు ప్రభుత్వం పెట్టిన షరతులను ఒప్పుకున్నప్పటికీ నాలుగు సంవత్సరాలు గడిచినా రెగ్యులర్ చేయకపోవడం ప్రభుత్వ తప్పిదాన్ని ఎందుకు అంగీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు?. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పోరాటమే వద్దనడం, బానిసల్లాగా బతకాలని చెప్పడం దుర్మార్గమని అన్నారు.
ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి జూనియర్ కార్యదర్శులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని దాసు ప్రభుత్వాన్ని కోరారు. జూనియర్ కార్యదర్శుల వల్ల గ్రామాల్లో 40 రకాల పనులు నిర్వహించి భారత ప్రభుత్వంచేత అవార్డులు పొంది, 317 జీవో విడుదల చేసి కార్యదర్శులను మానసిక ఒత్తిడితో కట్టడి చేయాలని ఆలోచన సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కార్యదర్శులు మనోధర్యంతో ఉండి పోరాడి ప్రభుత్వం మెడలు వంచాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని, సమస్యకు పరిష్కారం చూపాలని దాసు డిమాండ్ చేశారు. కార్యదర్శుల సమ్మెకు సంపూర్ణ సంఫీుభావాన్ని ప్రకటిస్తున్నామని దాసు తెలిపారు. ఐఎఫ్టియు గ్రామపంచాయతీ నాయకులు సోప్పరి గంగాధర్, శేఖర్, సాయన్న, రేణుక, భూదేవి, రాజగంగు, బుచ్చమ్మ, రాజన్న తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.