నిజామాబాద్, మే 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, నిజామాబాద్ ఆర్డీఓ రవిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా, ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంటదివెంట పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు సమాచారం తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులుపాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ప్రభుత్వపరంగా నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో అట్టహాసంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. ప్రజావాణి అనంతరం ఆయన వివిధ అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ వర్గాల వారికి చేకూర్చిన లబ్ది గురించి శాఖల వారీగా నివేదికలు రూపొందించాలని తెలిపారు.
అన్ని కార్యాలయాలను అందంగా అలంకరించాలని, ట్రాఫిక్ ఐలాండ్ లు, ముఖ్య కూడళ్ల వద్ద విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, చీఫ్ మినిస్టర్స్ కప్ -2003 క్రీడా పోటీల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. 22 , 23 , 24 తేదీలలో జిల్లా స్థాయిలో జరిగే క్రీడా పోటీలను నాగారంలోని రాజారామ్ స్టేడియం, పాత కలెక్టరేట్ మైదానం, పోలీస్ పరేడ్ గ్రౌండ్ తదితర వేదికలుగా నిర్వహించడం జరుగుతుందని, క్రీడా పోటీల విజయవంతానికి కృషి చేయాలని తెలిపారు.
కాగా, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరో పది రోజుల పాటు గట్టిగా పని చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ముఖ్యంగా రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడిరగ్ వెంటదివెంట జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, జోన్ల వారీగా నియమించబడిన జిల్లా అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి అన్ లోడిరగ్ ప్రక్రియను పరిశీలించాలని అన్నారు.