హక్కుల పరిరక్షణ కోసం అంకితభావంతో కృషి చేయాలి

నిజామాబాద్‌, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కులను పరిరక్షించేందుకు అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు ఏ.దేవయ్య అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు, అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రాలతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ, వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.

బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వారికి అందిస్తున్న విద్య, వైద్య సేవల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషన్‌ సభ్యుడు దేవయ్య మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో 12 శాతం వరకు బాలలు ఉన్నారని తెలిపారు. చిన్నారులు తమకు ఎదురయ్యే ఇబ్బందులు, బాధల గురించి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారని, అందువల్లే రాజ్యాంగం ద్వారా బాలలకు ప్రత్యేకంగా హక్కులు కల్పించబడ్డాయని అన్నారు. సమాజ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు సైతం ఎప్పటికప్పుడు కొత్తగా బాలల కోసం చట్టాలను రూపొందిస్తూ అమలు చేస్తున్నాయన్నారు. ఈ హక్కులు, చట్టాలు బాలలకు ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీతలో సమానమని అభిప్రాయపడ్డారు.

బాలల హక్కులు, చట్టాల అమలు తీరును పర్యవేక్షించేందుకు వీలుగా జాతీయ, రాష్ట్ర స్థాయిలలో కమిషన్‌ లు పని చేస్తున్నాయని తెలిపారు. క్షేత్ర స్థాయిలో బాల సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణ పూర్తి స్థాయిలో జరిగేలా పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని అధికారులకు హితవు పలికారు. ఏవైనా లోపాలు ఉంటే వాటిని సవరించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కర్తవ్యాన్ని సమర్ధవంతంగా నిర్వర్తించినప్పుడే భావి భారత పౌరులైన బాలల భవితవ్యానికి బంగారు బాటలు వేసినట్లవుతుందని సూచించారు.

సంరక్షణ కేంద్రాల్లో ఉంటున్న బాలలను సొంత తల్లిదండ్రుల తరహాలో వారి బాగోగులు చూడాలని, వారికి మంచి విద్య అందేలా చూడాలన్నారు. ప్రత్యేకించి బాలికల విద్య పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. బాలల సంరక్షణ కోసం కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థలకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని అన్నారు.

జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు మాట్లాడుతూ, గ్రామగ్రామాన కమిటీలు ఏర్పాటై బాలల సంరక్షణ కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం గట్టిగా కృషి చేయాలని సూచించారు. అభంశుభం ఎరుగని చిన్నారుల పట్ల అఘాయిత్యాలు, లైంగిక దాడులు, ఇతరాత్ర అకృత్యాలకు ఒడిగట్టే వారంతా వణికిపోయే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి రసూల్‌ బీ, సుధా రాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి చైతన్య కులకర్ణి, సీడీపీఓలు, పోలీస్‌, విద్య, వైద్యం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »