వ్యవసాయంలో ఏ.ఈ.ఓల పాత్ర క్రియాశీలకం

నిజామాబాద్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో సాగు రంగమే ప్రధాన ఆధారంగా ఉన్నందున వ్యవసాయ విస్తీర్ణ అధికారులు (ఏ.ఈ.ఓలు) క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. క్షేత్రస్థాయిలో అనునిత్యం రైతులను కలుస్తూ, వారి ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా పని చేయాలని హితవు పలికారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.

మరో పక్షం రోజుల్లో ఖరీఫ్‌ పంటల సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బంది రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అన్నారు. ముఖ్యంగా రైతులు వివిధ పంటలకు సంబంధించి నాణ్యతతో కూడిన విత్తనాలు ఎంపిక చేసుకునేలా చూడాలన్నారు. ఏ రకం పంటకు ఎలాంటి విత్తనాలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయో వివరించాలన్నారు. నకిలీ విత్తనాలతో ఎక్కడ కూడా రైతులు నష్టపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

అలాగే ఎరువుల విషయంలో రైతులు అనవసర ఆందోళనకు గురికాకుండా, వారి అవసరాలకు సరిపడా అందుబాటులో ఉన్నాయని వారికి స్పష్టమైన భరోసా కల్పించాలన్నారు. ముఖ్యంగా యూరియా విషయంలో రైతుల్లో ఆదుర్దా నెలకొని ఉంటుందని, అయితే జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా యూరియా ఎరువులను తెప్పిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 33 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, విడతల వారీగా మరిన్ని నిల్వలు వస్తాయని వివరించారు. రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడకుండా చూడాలన్నారు.

ఎరువుల వినియోగానికి సంబంధించిన వివరాలను ఈ-పాస్‌ లో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఈ విషయాలను క్షేత్రస్థాయిలో రైతులకు తెలియజేస్తూ, ఎరువుల విషయంలో వారు ఎలాంటి ఆందోళకు లోనుకాకుండా, అనవసర వదంతులను నమ్మకుండా చూడాలన్నారు. విత్తనాలు, ఎరువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖరీఫ్‌ సీజన్‌ ను విజయవంతంగా పూర్తి చేసుకోగల్గుతామని అన్నారు. ఏ.ఈ.ఓలు ప్రతిరోజూ రైతు వేదికలకు వెళ్లి అన్నదాతలతో సమావేశమై వారికి సాగు అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

శాఖలవారీగా దైనందిన కార్యక్రమాలను నిర్వహిస్తూనే, వారంలో కనీసం నాలుగు రోజులు రైతు వేదికల్లో రైతులతో భేటీలు నిర్వహించాలని సూచించారు. రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, వివిధ పథకాల గురించి ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఏ.ఈ.ఓలు తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని నిశితంగా పరిశీలన జరుపుతామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారుల ద్వారా ఏ.ఈ.ఓ ల పనితీరుపై వారంవారం నివేదికలు తెప్పించుకుంటామని అన్నారు.

క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు గుర్తిస్తే, వాటిని జిల్లా అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. కాగా, జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగును పెంపొందించేందుకు వీలుగా రైతులకు ఈ పంట ద్వారా సమకూరే లాభాల గురించి వివరిస్తూ, ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని అన్నారు. 4 వేల 600 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ సాగు చేయాలని జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌, ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్‌ దాస్‌, ఏ.డీలు, ఏ.ఓలు, ఏ.ఈ.ఓలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »