కామారెడ్డి, మే 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో పాడి, మత్స్య పరిశ్రమలకు లబ్ధిదారులకు బ్యాంకర్లు రుణాలను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం 2023 మార్చి త్రైమాసిక బ్యాంకుల రుణ వితరణ, పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యా రుణాలను ఇవ్వడానికి బ్యాంకర్లు జిల్లా కేంద్రంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి యువతకు అవగాహన కల్పించాలని తెలిపారు.
స్వయం సహాయక సంఘాలకు రూ.665 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. జిల్లాలో 8000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరడానికి బ్యాంకర్లు కృషి చేయాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలలో పెండిరగ్లో ఉన్న రుణాలను సత్వరమే అందించాలని కోరారు.
ఈ సందర్భంగా 2023-24 బ్యాంకుల వార్షిక ప్రణాళిక కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్లు అంబరీష్, నవీన్, ఎల్‌డిఓలు అనిల్, ప్రసాద్, ఎల్డిఎంలు చిందం రమేష్, భార్గవ్ సుదీర్, వివిధ శాఖల బ్యాంక్ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.