అక్రమ క్వారీలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి హస్తం

ఆర్మూర్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల మండలం బట్టాపూర్‌ గ్రామంలో గత ఏడేళ్లుగా పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై విచారణ జరిపి వెంటనే ఈటీఎస్‌ (ఎలక్ట్రానిక్‌ టోటల్‌ స్టేషన్‌) సర్వే నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలని బాల్కొండ నియోజకవర్గం భారతీయ జనతాపార్టీ నాయకులు మల్లికార్జున్‌ రెడ్డి జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతును కోరారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్వారీ లీజుకు తీసుకున్న జియో స్టోన్‌ ఇండస్ట్రీస్‌ 10 వేల క్యూబిక్‌ మీటర్లకు అనుమతులు తీసుకొని ఇప్పటికీ 12 లక్షల క్యూబిక్‌ మీటర్లకు పైగా తరలించారని, దీనికి పర్యావరణ అనుమతులు సైతం లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. నవంబర్‌ 2021 వరకు క్రషర్‌ నడుపుటకు అనుమతులు కూడా లేవని, ఈ క్వారీ స్కాంలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి హస్తం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

క్వారీ నుండి క్రషర్‌కి, క్రషర్‌ నుండి బహిరంగ మార్కెట్‌కి పెద్ద ఎత్తున సరుకు నడపడానికి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బండ్లబాట ద్వారా నడపాల్సి ఉండగా నిబంధనలు బేఖాతలు చేస్తూ కంకర రోడ్డు వేసినారని, దీన్ని పరిశీలించడానికి వచ్చిన అప్పటి రేంజ్‌ ఆఫీసర్‌ను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తన పలుకుబడితో 24 గంటల్లో బదిలీ చేయించిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. సామాన్య ప్రజలు ఒక నెల కరెంట్‌ బిల్లులు కట్టకుండా ఉంటే అధికారులు కనెక్షన్‌ తీసేస్తున్నారని, క్వారీ మీద 50 లక్షల వరకు కరెంట్‌ బిల్లులు కట్టకుండా పెండిరగ్లో ఉంటే అధికారులు ఏం చేస్తున్నారన్నారు. ఆరు నెలల క్రితం తాను ఇచ్చిన ఫిర్యాదు అనంతరం 50 లక్షల రూపాయలు కరెంట్‌ బిల్లులు కట్టడం జరిగిందన్నారు.

అనుమతులు తీసుకున్న పదివేల క్యూబిక్‌ మీటర్లకు బదులుగా, సుమారు 12 లక్షల క్యూబిక్‌ మీటర్లకు పైగా కంకర తరలించినట్లు పక్కా సమాచారం మాకుందని, దీనిమీద ఆరు నెలల క్రితం హైదరాబాద్‌ లోని గనుల శాఖ డైరెక్టర్‌ కి కి ఫిర్యాదు చేశామని, దీని మీద ఈటిఎస్‌ సర్వే నిర్వహించాలని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నిజామాబాద్‌ కి ఆదేశాలు ఇస్తే, సర్వే చేయుటకు డబ్బులు జమ చేయాలని సంబంధిత లీజు సంస్థకి అధికారులు లేఖల ద్వారా తెలిపినా, తమ బాగోతం బయటపడుతుందని ఇప్పటికీ జమ చేయలేదన్నారు.

సర్వే చేస్తే అసలు విషయాలు బయటపడతాయని సుప్రీం కోర్ట్‌ గైడ్‌ లైన్స్‌ ప్రకారం కనీసం 200 కోట్లకు పైగా జరిమానా పడే అవకాశం ఉందని, దీనిలో నుండి సింహభాగం జిల్లాకి అందుతుందని దీనివల్ల ఈ ప్రాంతం కాస్తయినా బాగుపడే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి ఇకనైనా సర్వే నిర్వహించి వాస్తవ విషయాలను వెలికి తీయాలని, లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్‌, భారతీయ జనతా పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు నారాయణరెడ్డి, మహిపాల్‌, సంజీవ్‌, పెద్ద ఎత్తున బట్టాపూర్‌ గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »