ఆర్మూర్, మే 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ పేమెంట్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023 ఏప్రిల్ 21 వరకు స్పాట్ వాల్యుయేషన్ ముగిసినప్పటికీ ఇప్పటివరకు పేమెంట్ ఇవ్వకపోవడం సరికాదని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఇంటర్మీడియట్ లెక్చరర్‌లకు వేసవిలో వేతనాలు లేక అవస్థలు పడుతున్న విషయం ఈ ప్రభుత్వానికి తెల్వదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో వేలాదిమంది ప్రైవేట్ లెక్చరర్స్ పనిచేస్తున్నారని, అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో నెట్టుకొస్తున్నారని ఆయన వివరించారు. ఒక దిక్కు ప్రభుత్వం కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న లెక్చరర్లను క్రమబద్ధీకరణ చేయడంలో చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లెక్చరర్స్ పట్ల నిర్లక్ష్యంగా వివరించడం తగదని ఆయన సూచించారు.
చదువుకున్న విద్యావంతుల పట్లే ఇలా వ్యవహరించడం ఎలా సరిందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా వెంటనే నిర్లక్ష్యం విడనాడి, పేమెంట్ డబ్బులను అందజేయాలని దాసు అధికారులని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.