నిజామాబాద్, మే 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం మధ్యాహ్న భోజనం పథకం (ఏఐటీయూసీ) కార్మికుల విస్తృతస్థాయి సమావేశం ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశం యూనియన్ జిల్లా నాయకులు సాయమ్మ అధ్యక్షతన జరిగింది.
ఇందులో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పనిభద్రత, పిఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మూడువేల రూపాయల వేతనాన్ని బకాయిలతో సహా చెల్లించాలని, కార్మికులకు రావలసిన వంట సామాగ్రి పెండిరగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, కోడిగుడ్డును ప్రభుత్వమే సరఫరా చేయాలని, గ్యాస్ సిలిండర్ ప్రభుత్వమే ఇవ్వాలని, ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు మరియు బిల్లులు చెల్లించాలని తదితర డిమాండ్లతో జూన్ మొదటి వారంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
అనంతరం నిజామాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా వై. ఓ మయ్య, జిల్లా అధ్యక్షురాలుగా బైరి సాయమ్మ, ప్రధాన కార్యదర్శిగా టీ. చక్రపాణి, ఉపాధ్యక్షులుగా నాగలక్ష్మి, గంగమణి, సహాయ కార్యదర్శులుగా స్రవంతి, గంగాధర్, కోశాధికారిగా బాలరాజులతోపాటు 34 మండలాల అధ్యక్ష కార్యదర్శులను కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.చక్రపాణి తెలిపారు.