కామారెడ్డి, మే 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సామాజిక ఆర్ధిక ముఖ చిత్రం పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో ప్రణాళిక శాఖ ముద్రించిన తెలంగాణా సామాజిక ఆర్ధిక ముఖ చిత్రం-2023 పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పుస్తకం రాష్ట్ర సామాజిక ఆర్ధిక స్థితిగతులను తెలపడమే గాక ప్రభుత్వ విధానాలు, పధకాలు, వివిధ కార్యక్రమాల సమాచారాన్ని, వాటి పనితీరును తెలుసుకోవచ్చన్నారు. వివిధ విభాగాలలో రాష్ట్రం సాధించిన ప్రగతి, జవాబుదారీతనం, పారదర్శకతో బంగారు తెలంగాణ సాధన దిశగా భవిష్యత్ మార్గాలపై సమగ్ర అధ్యయనం చేయడానికి ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
ఇంతటి చక్కటి సమాచారంతో రూపొందించిన పుస్తకం పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులకే గాక సామాజికవేత్తలు, మేధావులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 311 పేజీలు గల ఈ పుస్తకం ధర 150 రూపాయలు ఉందన్నారు. ఈ పుస్తకం కావలసిన వారు కలెక్టరేట్ లోని ముఖ్యప్రణాళిఖాధికారి కార్యాలయంలో కార్యాలయ పనివేళలందు 150 రూపాయాలకు చెల్లించి పొందవచ్చని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి రాజారాం, డిఆర్‌డిఓ సాయన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, పశు సంవర్ధక అధికారి సింహరావ్ పాల్గొన్నారు.