పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు జరిగింది

కామారెడ్డి, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ జిల్లా యంత్రాంగాలకు సూచించారు. బుధవారం ఆయన సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రవీందర్‌ సింగ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.అనిల్‌ కుమార్‌లతో కలిసి జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ధాన్యం సేకరణ, రైస్‌ మిల్లులకు వాటి తరలింపు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ సీజన్‌లో ముందస్తుగానే ఏప్రిల్‌ 10 వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి గుర్తు చేశారు. గత చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. గతేడాది 28.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఈ ఏడాది ఇప్పటికే పది లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు అదనంగా 38.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు.

నాలుగున్నర లక్షల మంది రైతుల నుండి ధాన్యం సేకరించగా, ఈసారి 4.55 లక్షల మంది రైతుల వద్ద ధాన్యం సేకరించామని తెలిపారు. ధాన్యం దిగుబడులకు అనుగుణంగా అదనంగా 400 కొనుగోలు కేంద్రాలను సైతం అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలిచిందని చెప్పారు.

21 శాతం తేమ కలిగిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామన్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల పాలకవర్గాల తోడ్పాటుతోనే ఇంత పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలను కొనుగోలు చేయడం సాధ్యపడిరదని మంత్రి గంగుల కమలాకర్‌ ఈ సందర్భంగా వారిని అభినందించారు. ప్రస్తుతం మరో పక్షం రోజుల పాటు మరింత శ్రద్ధగా పనిచేస్తూ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

రైతుల నుండి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తూ, వాటిని భద్రపరిచేందుకు వీలుగా అవసరమైన చోట గిడ్డంగులను గుర్తించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యానికి తరుగు తీయకుండా రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. ధాన్యం రవాణాకు ఆటంకాలు తలెత్తకుండా అదనపు వాహనాలను సమకూర్చుకోవాలని అన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ విపాటిల్‌, రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, డీఎస్‌ఓ పద్మ, సివిల్‌ సప్లైస్‌ డీ.ఎం అభిషేక్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »