బాన్సువాడ, మే 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్మిన వారిపై ఎంతటి వారైనా ఉపేక్షించబోమని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విత్తన టాస్క్ ఫోర్స్ అధికారి బిచ్కుంద ఏడిఏ నూతన్ కుమార్ అన్నారు. శుక్రవారం బీర్పూర్ మండల కేంద్రంలో ఉన్న ఎరువుల దుకాణాలను ఆయన టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవకాశాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారస్తులు తమ లాభాపేక్ష కోసం నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు కంపెనీ లేబుల్, మరియు ధర తప్పనిసరి చేసిన విత్తనాలకు రసీదును దుకాణదారు నుండి పొందాలన్నారు.
వ్యాపారస్తులు స్టాక్ రిజిస్టర్, నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు చేసుకోవాలని ఆయన వ్యాపారస్తులకు సూచించారు. కార్యక్రమంలో ఏడిఏ నూతన్ కుమార్, వ్యవసాయ అధికారులు అమర్ ప్రసాద్, కమల, ఏఎస్‌ఐ రాజేశ్వర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.