నిజామాబాద్, మే 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగానికి జీవన్మరణ సమస్యగా పరిణమించిన ప్రకృతి వైపరీత్యాల బారి నుండి పంట నష్టాలను అధిగమించేందుకు ముందస్తుగా పంట వేసుకోవడం ఉత్తమ మార్గమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. వానాకాలం పంటను జూన్ మొదటి వారం నాటికే విత్తుకోవాలని, యాసంగి పంటను మార్చి నెల 15వ తేదీ లోపు నాటడం పూర్తి చేసుకోవాలని సూచించారు. దీనివల్ల ప్రతి ఏటా ఏప్రిల్‌లో కురిసే అకాల వర్షాలు, వడగళ్ల వానల బారి నుండి, నవంబర్‌లో సంభవించే తుపాన్ల ప్రభావంతో కురిసే వర్షాల బారి నుండి పంటలను కాపాడుకోగల్గుతామని అన్నారు.
ప్రకృతి వైపరీత్యాలతో వచ్చే అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల కలిగే పంట నష్టాన్ని నివారించేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, అవలంభించాల్సిన పద్దతులపై బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతులకు శనివారం నస్రుల్లాబాద్ మండలం నెమెలి గ్రామంలోని సాయిబాబా ఆలయ ఫంక్షన్ హాల్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ముందస్తుగా పంట వేయాల్సిన ఆవశ్యకత గురించి, దీనివల్ల సమకూరే లాభాల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా చీడపీడలను తట్టుకుని స్వల్పకాలిక వ్యవధిలో అధిక దిగుబడులు అందించే మేలు రకం విత్తనాల గురించి తెలిపారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,పంటల సాగుకు పెట్టుబడి పెట్టి, ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు అకాల వర్షాల బారినపడి నోటికాడి ముద్దను లాగేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే కురిసిన వడగండ్ల వానలకు రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చిందన్నారు. అన్నదాతను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేసిందని, రూ. 200 కోట్ల నిధులను విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆర్ధిక శాఖను ఆదేశించారని స్పీకర్ పోచారం తెలిపారు.
అయితే, ప్రభుత్వం అందించే నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఊరటను అందించదని, అకాల వర్షాల బారి నుండి గట్టెక్కేందుకు ముందస్తుగానే పంటలు విత్తుకోవడం అత్యావశ్యకంగా మారిందని అన్నారు. వానాకాలం పంటను జూన్ మొదటి వారంలో వేసుకుంటే అక్టోబర్ 15 లోపే పంటలు చేతికందుతాయని, యాసంగి పంటను మార్చి 15 వ తేదీ లోపు విత్తుకుంటే అక్టోబర్ నెలాఖరు నాటికి చేతికంది అమ్మకాలను పూర్తి చేసుకోవచ్చని సూచించారు.
రైతాంగ శ్రేయస్సే ధ్యేయంగా దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగుకు అవసరమైన పెట్టుబడిని అందించడంతో పాటు సాగు నీరు, విద్యుత్, ఎరువులు, విత్తనాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చిందన్నారు. అంతేకాకుండా రైతులు పండిరచిన ప్రతి గింజను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్, జార?ండ్ ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల అక్కడి రైతులు బియ్యం, ధాన్యం నిల్వలను తెలంగాణకు తరలిస్తూ కారుచౌక ధరలకు విక్రయించి వెళ్తున్నారని అన్నారు.
ప్రభుత్వ తోడ్పాటును స్థానిక రైతులు సద్వినియోగం చేసుకుంటూ, పంటల సాగులో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హర్షం వెలిబుచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన సమయంలో రాష్ట్రంలో సాగు యోగ్యత కలిగిన భూమి విస్తీర్ణం కోటీ 8 లక్షల ఎకరాలు ఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు, ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం వంటి నిర్ణయాల అమలుతో రాష్ట్రంలో ప్రస్తుతం పంటల సాగు విస్తీర్ణం 2.18 కోట్ల ఎకరాలకు పెరిగిందని వివరించారు.
2015 లో వరిధాన్యం 36 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో అక్షరాలా 2.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని అన్నారు. అన్ని రకాల పంటలను కలుపుకుంటే మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడుల పంట తెలంగాణ రాష్ట్రంలో పండుతోందని తెలిపారు. రాష్ట్ర రైతాంగం బ్యాంకుల నుండి అప్పులు తీసుకునే పరిస్థితి దూరమై, అన్నదాతలు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్లు చేసే స్థాయికి ప్రతి ఒక్కరు ఎదగాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని అన్నారు.
ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా రైతులు ముందస్తుగా పంటలు వేసుకుని ప్రక్రుతి వైపరీత్యాల వల్ల వాటిల్లే నష్టాలను అధిగమించాలని స్పీకర్ పోచారం హితవు పలికారు. ఈ దిశగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు క్షేత్ర స్థాయిలో ఉంటూ ముందస్తుగా పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 3వ తేదీన రైతు వేదికలలోనూ ఈ విషయమై రైతులను చైతన్యపరచాలని అన్నారు.
నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలను నిలువరించే శక్తి ఎవరికీ లేదని, అయితే పంట సాగు కాలాన్ని కొంత ముందుకు జరుపుకుని అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల వాటిల్లే నష్టాలను నివారించుకోవచ్చని రైతులకు సూచించారు. ఇటీవల రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ రైతులకు అవగాహన కల్పించాల్సిందిగా సూచించారని అన్నారు. ఈ దిశగా రాష్ట్రంలోనే మొట్టమొదటగా బాన్సువాడ నియోజకవర్గంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ మూడవ తేదీన రైతు దినోత్సవం సందర్భంగా అన్ని రైతు వేదికలలో ముందస్తుగా పంటలను వేసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బాన్సువాడ, బోధన్ ప్రాంతాలకు చెందిన రైతులు కొంత ముందస్తుగానే పంటలు సాగు చేయడం వల్ల ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తక్కువ నష్టం వాటిల్లిందని, ఇతర ప్రాంతాల్లో ఎక్కువ పంట నష్టం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వానాకాలం పంటలు మార్చి 15 లోపు, యాసంగి పంటలు జూన్ మొదటి వారంలోపు విత్తుకోవాలని సూచించారు.
ముందస్తుగా పంటలు వేయడం వల్ల దిగుబడులు తగ్గుతాయనే అభిప్రాయం సరికాదని, పైపెచ్చు అధిక దిగుబడులు, చీడపీడల నివారణ తక్కువగా ఉంటుందని, ఈ విషయంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు. ప్రస్తుత వానాకాలం పంట సాగుకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామని, రైతులు ఎలాంటి ఆదుర్దాకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
అవగాహన సదస్సులో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్ దాస్, డీసిఓ సింహాచలం, బాన్సువాడ ఆర్డీఓ రాజాగౌడ్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, రైతు సమన్వయ సమితి కామారెడ్డి జిల్లా చైర్మన్ అంజిరెడ్డి, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు డాక్టర్ నవీన్, బాలాజీ నాయక్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతు ప్రతినిధులు, వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల, రెవెన్యూ తదితర శాఖ అధికారులు, నియోజకవర్గ రైతులు పాల్గొన్నారు.