దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలి

నిజామాబాద్‌, మే 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. జూన్‌ 2 నుండి 22 వ తేదీ వరకు ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఇంచార్జ్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌లతో కలిసి కలెక్టర్‌ అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, చేపట్టాల్సిన చర్యల గురించి జిల్లా పాలనాధికారి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రధానంగా తెలంగాణ ఏర్పడిన మీదట గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో ఆయా శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వివిధ వర్గాల ప్రజలకు చేకూర్చిన లబ్ది, సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా చూడాలని సూచించారు. ముఖ్య కూడళ్లను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించాలని సూచించారు.

ఎలాంటి తప్పిదాలు, అపశ్రుతులు తావులేకుండా అట్టహాసపు ఏర్పాట్ల నడుమ జిల్లా వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తూ, అన్ని వర్గాల ప్రజలు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సరైన ప్రణాళికతో కార్యక్రమాలను చేపట్టాలని హితవు పలికారు. ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 2 వ తేదీన పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఉంటాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, 3 న అన్ని రైతు వేదికల్లో రైతు దినోత్సవం జరుపాలని, ప్రతి చోట కనీసం వేయి మంది రైతులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముందస్తు పంట వేయాల్సిన ఆవశ్యకత, ఆయిల్‌ పామ్‌ సాగుతో సమకూరే లాభాల గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖల అధికారులు పాల్గొని రైతు దినోత్సవం విజయవంతానికి కృషి చేయాలన్నారు. 4 న పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సురక్షా దివస్‌, 5 న విద్యుత్‌ విజయోత్సవం, 6 న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7 న సాగునీటి దినోత్సవం, 8 న ఊరూరా చెరువుల పండుగ కారక్రమాలను నిర్వహించాలని వివరించారు. చెరువుల వద్ద ఉత్సవాలు జరిగే సమయంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

9 న తెలంగాణ సంక్షేమ సంబరాలను, 10 న తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని, 11 న సాహిత్య దినోత్సవం, 12 న తెలంగాణ రన్‌, 13 న మహిళా సంక్షేమ దినోత్సవం, 14 న తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం, 15 న పల్లె ప్రగతి దినోత్సవం, 16 న పట్టణ ప్రగతి దినోత్సవం, 17 న తెలంగాణ గిరిజనోత్సవం, 18 న తెలంగాణ మంచినీళ్ల పండుగ, 19 న తెలంగాణ హరితోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి మున్సిపల్‌ వార్డులో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, పోలీస్‌ సహా అన్ని శాఖలు విధిగా భాగస్వాములు కావాలని కలెక్టర్‌ సూచించారు.

20 న తెలంగాణ విద్యా దినోత్సవంలో భాగంగా అన్ని కళాశాలలు, పాఠశాలల్లో జెండాను ఎగురవేయాలని, విద్యాలయాలను అందంగా ముస్తాబు చేయాలని, విద్యార్థులకు బుక్స్‌, యూనిఫామ్స్‌ పంపిణీ చేయాలని, వ్యాసరచన, వకృత్వ, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించాలని, మన ఊరు – మన బడి పనులు పూర్తయిన చోట పాఠశాలలను ప్రజాప్రతినిధులకే ప్రారంభోత్సవాలు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 21 న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను అలంకరింపజేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు.

22 న అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మూడు వారాల పాటు కొనసాగే దశాబ్ది ఉత్సవాల్లో అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేస్తూ, కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. పోలీస్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్‌ శాఖ తరఫున పూర్తి స్థాయిలో భాగస్వామ్యం ఉండేలా చూస్తామని, అవసరమైన ప్రతి చోట తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తామని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రన్‌ విజయవంతానికి పోలీస్‌ సిబ్బంది అందరు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ గిరిరాజా, జెడ్పి సీఈఓ గోవింద్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »