ఘనంగా ఉత్సవాలు

కామారెడ్డి, మే 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2న నుంచి 22 వరకు జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కోసం ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు.

జూన్‌ 2న జరిగే ప్రారంభోత్సవ వేడుకలకు పతాకావిష్కరణను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చేస్తారని తెలిపారు. జూన్‌ 3న తెలంగాణ రైతు దినోత్సవం వేడుకలు క్లస్టర్‌ పరిధిలోని రైతు వేదికలో నిర్వహించాలని చెప్పారు. క్లస్టర్‌ పరిధిలో ఉన్న రైతులకు వచ్చి రైతుబంధు, బీమా, ఉచిత విద్యుత్‌ వివరాలను రైతులకు తెలియజేయాలని పేర్కొన్నారు. జూన్‌ 4న సురక్ష దినోత్సవం పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో కళాభారతిలో నిర్వహిస్తారని తెలిపారు.

జూన్‌ 5న విద్యుత్తు రంగంలో సాధించిన విజయాలను నియోజకవర్గాల పరిధిలో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు తెలియజేయాలని చెప్పారు. ఎమ్మెల్యే, స్థానిక ప్రజా ప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించాలని పేర్కొన్నారు. జూన్‌ 6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జూన్‌ 7న సాగునీటి దినోత్సవం నిర్వహించాలని తెలిపారు.

మిషన్‌ కాకతీయ ద్వారా గొలుసు కట్టు చెరువుల అభివృద్ధి, చెక్‌ డ్యాముల నిర్మాణం వివరాలు రైతులకు తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »