ఆర్మూర్, మే 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తూ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకుంటూ జర్నలిస్ట్ కాలనీవాసులు ఆర్మూర్‌కు ఆదర్శంగా నిలుస్తున్నారని పురపాలక చైర్ పర్సన్ పండిత్ వినీత ప్రశంసించారు. జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛకాలనీ సమైక్య కాలనీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాలనీవాసులతో కలిసి ఆమె ఉద్యానవనంలో పిచ్చిమొక్కలను తొలగించారు.
కాలనీవాసులు శ్రమదానంతో శుభ్రం చేసిన మురుగు కాలువలను ఆమె పరిశీలించారు. అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో స్వచ్చందంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాలనీవాసులను చైర్ పర్సన్ అభినందించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరం ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. ప్రతివారం శ్రమదానం ప్రశంసనీయమని, అన్ని కాలనీలు జర్నలిస్ట్ కాలనీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాలనీలో మురుగు కాలువలు, కల్వర్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు.
తాము కోరిన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిన ఛైర్ పర్సన్ పండిత్ వినీతకు, సహకరించిన స్థానిక కౌన్సిలర్ వనం శేఖర్ కు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్ వనం శేఖర్, కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులంతా కలిసి రోడ్ల పక్కనున్న ముళ్ళ పొదలను, పిచ్చి మొక్కలను, చెత్తా చెదారాన్ని తొలగించారు. మురుగు కాలువలు శుభ్రం చేశారు.
స్థానికులకు పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, సుంకే శ్రీనివాస్, కార్యదర్శులు కె.రాజు, కొండి పవన్, ఎల్.సాయన్న, కాలనీ పెద్దలు ఎస్.గణపతి, ఎల్టీ కుమార్, భూమయ్య, విశ్రాంత విద్యాధికారి లక్ష్మయ్య, నరహరి, సీహెచ్. విద్యాసాగర్, జార్జి, రాము, నల్ల సాయన్న, బిక్షపతి, భాజన్నతదితరులు పాల్గొన్నారు.