కామారెడ్డి, మే 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 2 నుంచి 22 వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకలు వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జూన్ 2న ఉదయం 9 గంటల లోపు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పథకావిష్కరణ చేయాలని తెలిపారు.
జూన్ 2న కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట పతాకావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. జూన్ 3న రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జెండా ఆవిష్కరణ చేయాలన్నారు.
రైతు వేదికను విద్యుత్ దీపాలతో అలంకరించాలని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను రైతులకు వివరించాలని సూచించారు. అధిక దిగుబడులు సాధించిన ఉత్తమ రైతులకు సన్మానం చేయాలని పేర్కొన్నారు. జూన్ 4న సురక్ష దినోత్సవం కళాభారతిలో నిర్వహించాలని తెలిపారు. జూన్ 8న ఊరురా చెరువుల పండగ జరిపాలని చెప్పారు. గ్రామంలోని ప్రధాన చెరువును ఎంపిక చేయాలన్నారు.
కట్ట మైసమ్మకు పూజలు నిర్వహించాలని తెలిపారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని చెప్పారు. మహిళలు బతుకమ్మలతో చెరువు వద్దకు వచ్చే విధంగా ఐకెపి అధికారులు చూడాలన్నారు. చెరువు ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.