నిజామాబాద్, మే 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రాశస్త్యం చాటిచెప్పేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుండి అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులతో చీఫ్ సెక్రెటరీ సమీక్ష జరిపారు.
దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్లు, సన్నద్ధత గురించి జిల్లాల వారీగా పాలనాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తొమ్మిదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి శాఖల వారీగా ఫ్లెక్సీలు, కరపత్రాల ద్వారా తెలియజేయాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.
కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా, మండల స్థాయి అధికారులను నియమించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు ఈ వేడుకల్లో మమేకమయ్యేలా చూడాలన్నారు. ఉత్సవాల మొదటి రోజైన జూన్ 2 న మొదటగా అమరవీరుల స్థూపాల వద్ద తెలంగాణ అమరులకు నివాళులర్పించాలని, ఉదయం 9 గంటలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. మరుసటి రోజైన 3 వ తేదీన రైతు దినోత్సవం సందర్భంగా రైతు వేదికలను విద్యుద్దీపాలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించి ఎడ్ల బండ్ల ప్రదర్శనల ద్వారా పండగవాతావరణంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
రైతులను సమీకరించి సాగు రంగానికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు గురించి తెలియజేయాలని, రైతు బీమా లబ్ధిదారులతో వారి అనుభవాల గురించి మాట్లాడిరచాలని అన్నారు. ముందస్తుగా పంటలను వేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి, ఆయిల్ పామ్ సాగుతో సమకూరే లాభాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇదే తరహాలో మిగతా కార్యక్రమాలను సైతం సమర్ధవంతంగా నిర్వహించాలని, ముఖ్యంగా విద్యుత్ దినోత్సవం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సురక్షా దినోత్సవం, సాగునీటి దినోత్సవం, ఊరూరా చెరువుల పండుగ, గిరిజనోత్సవం, తెలంగాణ రన్ తదితర కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని తెలిపారు.
గిరిజనోత్సవం సందర్భంగా కొత్త జీ.పీలుగా ఏర్పాటైన తండాలను అందంగా ముస్తాబు చేసి, నిర్ణీత కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మంచినీళ్ల పండుగ సందర్భంగా ప్రజలతో ఫిల్టర్ బెడ్ల సందర్శన చేయాలని, హరితోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సీ.ఎస్ సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని, అన్ని శాఖలు ఈ దిశగా సమిష్టి కృషి చేయాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం దిశానిర్దేశం చేశారని సీ.ఎస్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో 106 రైతు వేదికలలో రైతు దినోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. మంచినీళ్ల పండుగ కార్యక్రమం సందర్భంగా జిల్లాలోని నాలుగు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ప్రజాప్రతినిధులు, ప్రజలు, మీడియా ప్రతినిధులు సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
హరితోత్సవంలో భాగంగా నియోజకవర్గ కేంద్రాలతో పాటు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో విరివిగా మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ముఖ్యంగా 2014 కు ముందు అటవీ ప్రాంతాలు ఎలా ఉండేవి, ప్రస్తుతం హరితహారం అమలు చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పచ్చదనం పెరిగిన విషయాన్ని శాటిలైట్ ఫోటోల ద్వారా వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ, ప్రజాప్రతినిధుల సహకారంతో దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ లు చిత్రమిశ్రా, చంద్రశేఖర్, ట్రైనీ ఐ.ఏ.ఎస్ కిరణ్మయి, అదనపు సీ.పీ గిరిరాజా, జెడ్పి సీఈఓ గోవింద్, సీపీఓ బాబురావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.