గ్రామగ్రామాన అట్టహాసంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

నిజామాబాద్‌, మే 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పక్కా ప్రణాళికతో గ్రామగ్రామాన అట్టహాసంగా చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. దశాబ్ది ఉత్సవ ఏర్పాట్ల సన్నద్ధతపై మంగళవారం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిలలో స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

ప్రతి కార్యక్రమానికి ఇంచార్జ్‌ లను నియమించుకుని నిశితంగా పర్యవేక్షణ జరపాలన్నారు. ఆయా కార్యక్రమాల వివరాలను రోజువారీగా సేకరిస్తూ, జిల్లా స్థాయిలోనూ పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగం ద్వారా కంట్రోల్‌ రూమ్‌ ను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. క్షేత్ర స్థాయిలో నిర్వహించిన కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లతో కూడిన వివరాలను రోజువారీగా సాయంత్రం నాలుగు గంటల లోపు జిల్లా కంట్రోల్‌ రూమ్‌ కు పంపించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు మొదలుకుని క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరు దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో పాలుపంచుకోవాలని సూచించారు.

గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి, ప్రజలకు చేకూర్చిన లబ్ది గురించి ప్రతిబింబించేలా సంబంధిత శాఖల ద్వారా గ్రామాలలో జూన్‌ 1 నాటికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రొటోకాల్‌ ను అనుసరిస్తూ ప్రజాప్రతినిధులను దశాబ్ది కార్యక్రమాలకు ఆహ్వానించాలని అన్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు అందరిని సమన్వయము చేసుకుంటూ ఉత్సవాల విజయవంతానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ముఖ్యంగా జూన్‌ 3 న రైతు దినోత్సవం సందర్భంగా అన్ని రైతు వేదికలను అందంగా ముస్తాబు చేయాలని, ప్రతి గ్రామం నుండి రైతులను సమీకరించి అలంకరించిన ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ప్రదర్శనగా తరలివచ్చేలా చూడాలన్నారు. ముందుగా జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆదర్శ రైతులు, రైతు బందు, రైతు బీమా లబ్ధిదారులతో వారి అనుభవాలను వివరింపజేయాలని, ముందస్తు పంటలు వేయాల్సిన ఆవశ్యకత, ఆయిల్‌పామ్‌ సాగు ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

జూన్‌ 08న తెలంగాణ చెరువుల పండుగ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యేలా చొరవ చూపాలన్నారు. ఎలాంటి అపశ్రుతులు, లోటుపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. జూన్‌ 15 పల్లె ప్రగతి కార్యక్రమాలను అన్ని గ్రామ పంచాయతీలలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించాలని,16 న మున్సిపాలిటీల పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరపాలని అన్నారు.

ర్యాలీలు, మానవ హారం, రంగోలీ పోటీలు, కళాజాత ప్రదర్శనలు నిర్వహించాలని, 17 న జీ,పీలుగా ఏర్పడిన జిల్లాలోని 71 గిరిజన తండాలలో పెద్ద ఎత్తున నిర్దేశిత కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. 18 న మంచినీళ్ల పండుగ సందర్భంగా మిషన్‌ భగీరథ ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకుల నుండి గ్రామ పంచాయతీల వరకు ర్యాలీలు జరపాలని, 19 న హరితోత్సవం కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తూ ప్రతి పల్లెలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు.

జూన్‌ 22 న అమరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ అమరవీరులను మౌనం పాటించి నివాళులర్పించాలన్నారు. మొత్తంగా జూన్‌ 02 నుండి 22 వ తేదీ వరకు వివిధ స్థాయిలలో జరిగే దశాబ్ది ఉత్సవాలలో అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొని, సమిష్టి తత్వంతో పనిచేస్తూ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ట్రైనీ అడిషనల్‌ కలెక్టర్‌ కిరణ్మయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »