కామారెడ్డి, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు బస్తి దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సర్కారీ దావకానాల్లో మెరుగైన వైద్యం అందడం వల్ల ఆస్పత్రికి వచ్చే రోగులు సంతృప్తి చెందుతున్నారని తెలిపారు. 5, 28,29,30 వార్డుల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి డబ్బులు చెల్లించి ఆర్థికంగా నష్టపోవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. కామారెడ్డి జిల్లాకు ప్రభుత్వం మెడికల్ కాలేజీని మంజూరు చేసిందని తెలిపారు.
వేసవి కాలంలో అకాల వర్షాలు కురవడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పేదలు పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, కౌన్సిలర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.