హైదరాబాద్, జూన్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో విస్తరించేందుకు దాదాపు మరో వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందని పేర్కొంది. రుతుపవనాల ప్రవేశంతో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు చెప్పింది. చిరుజల్లులను చూసి తొందరపడి రైతులు విత్తనాలు విత్తుకోవద్దని సూచించింది. చిరుజల్లులకు విత్తనాలు విత్తుకుంటే భూమిలో మొలకలు ఊడికిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.
రైతులు విత్తనం విత్తే తేమ కనిపించిన సమయంలోనే విత్తుకోవాలని తెలిపింది. ఇక తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఉత్తర, దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. దాని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మూడు రోజులు పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, హైదరాబాద్, చుట్టూ పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 41 వరకు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. గురువారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు.
ఇక బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 40.3, భద్రాచలం 40.8, హనుమకొండ 38,హైదరాబాద్ 38.9, ఖమ్మం 40.2, మెదక్ 40.8, మహబూబ్‌నగర్ 40, నల్లగొండ 41.5, నిజామాబాద్ 40.9, రామగుండం 39.2 డిగ్రీల చొప్పున నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది.