నిజామాబాద్, జూన్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య, మధ్యాహ్న భోజన వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. చక్రపాణి, జిల్లా అధ్యక్షురాలు బైరి సాయమ్మలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి పేద విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టి ఆదుకోవడంలో భాగంగా మధ్యాహ్న భోజన పథకాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిర్వహిస్తున్నారన్నారు.
కానీ ఆచరణలో వంట చేస్తున్న కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా వేతనాలు లేకుండా సరైన సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల రోజు రోజుకు నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న, వాటికనుగుణంగా మధ్యాహ్న భోజన కార్మికులకు వంట సామాగ్రికి సంబంధించిన రేట్లు పెంచకుండా వారికి సరైన వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో కార్మికులకు సంబంధించిన బిల్లులు సుమారు 8 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఎన్నిసార్లు ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించిన అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన నేటికీ రూపాయి చెల్లించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులకు 2 వేల రూపాయల వేతనం పెంచుతున్నామని మార్చ్ 2022 సంవత్సరం నుండి వాటిని అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా నేటికీ అమలు కావడం లేదన్నారు.
కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని తాకిన వాటికి సంబంధించిన డబ్బులు కార్మికులకు చెల్లించకుండా కచ్చితంగా కార్మికులు కోడిగుడ్లు విద్యార్థులకు పెట్టాలని అధికారులు ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయడం సరికాదన్నారు. కోడిగుడ్లను ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గత 11 సంవత్సరాల క్రితం ఇచ్చిన వంట పాత్రల్ని నేటికీ వాడుతున్నారని పాత్రలు పాడైనా కార్మికులు వారి ఇంటి నుండి తీసుకొచ్చి వంట చేస్తున్న ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న కొత్త వంట పాత్రలు ఇవ్వలేదన్నారు.
గ్యాస్ సిలిండర్ ధరలు 1200 చేరిన వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదని, కావున గ్యాస్ సిలిండర్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, తదితర డిమాండ్లతో ఈనెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని, కార్యక్రమాల్లో మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.