నిజామాబాద్, జూన్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించనున్న రైతు దినోత్సవ సంబరానికి సర్వం సిద్ధం చేశారు. ఈ వేడుకలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గల 106 రైతు వేదికలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల వెలుగులతో రైతు వేదికలన్నీ సరికొత్త శోభతో కళకళలాడుతున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం దశాబ్ది ఉత్సవాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సాగు రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ఇతోధిక తోడ్పాటు గురించి అవలోకనం చేస్తూ, ముందస్తుగా పంటలు వేసుకోవాల్సిన ఆవశ్యకత, ఆయిల్ పామ్ సాగుతో సమకూరే లాభాలు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు రైతులకు అవగాహన కల్పించనున్నారు. అన్నదాత శ్రేయస్సే ధ్యేయంగా దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాల ద్వారా చేకూరుతున్న ప్రయోజనాల గురించి లబ్దిపొందుతున్న ఆదర్శ రైతులు తమ అనుభవాలను వ్యక్తపర్చనున్నారు.
పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించేలా జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి రైతు వేదిక వారీగా వివిధ విభాగాలకు ప్రత్యేక అధికారులను నియమించి, నిశిత పర్యవేక్షణ జరుపుతున్నారు. రైతులు అందంగా అలంకరించిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ర్యాలీగా రైతు వేదికలకు తరలివచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ అందరికీ ఆహ్వానాలు అందించారు.
పండుగ వాతావరణంలో నిర్వహించాలి : అదనపు కలెక్టర్
రైతు దినోత్సవ కార్యక్రమాలను ప్రతి చోట పండుగ వాతావరణంలో నిర్వహించాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గ నోడల్ ఆఫీసర్లు, సంబంధిత శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులతో రైతు దినోత్సవ తుది ఏర్పాట్లపై సమీక్షించారు.
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రణాళికాబద్ధంగా ఈ వేడుకను చేపట్టి సమిష్టి కృషితో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు మమేకమవుతూ, రైతులందరూ తరలివచ్చేలా చూడాలని, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ఆయా విభాగాల వారీగా నియమించబడిన ఇంచార్జీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రైతులకు చిన్నపాటి ఇబ్బంది సైతం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.