బాన్సువాడ, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యా బోధన చేపట్టడం జరుగుతుందని బిచ్కుంద మండల నోడల్ అధికారి కిషోర్ అన్నారు. శనివారం బిచ్కుంద గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మండల నోడల్ అధికారి కిషోర్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, హరిజనవాడ ప్రాథమిక పాఠశాల సంయుక్తంగా ఇంటింటికి ఉపాధ్యాయ బృందం తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యత ను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యతోపాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచిత పుస్తకాలు అందించడం జరుగుతుందని, ప్రైవేటు పాఠశాలలో చేర్పించడం ద్వారా డబ్బు వృధా చేసుకోవద్దని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.
బడి బయట పిల్లలు గుర్తించి సమీప పాఠశాలలో విద్యార్థులను చేర్పించి వారి భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల నోడల్ అధికారి కిషోర్, ఉపాధ్యాయులు దత్తు గౌడ్, రాజ్ కుమార్, రమేష్, శ్యాంసుందర్, గంగాధర్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.