నిజామాబాద్, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రకృతి వైపరీత్యాల బారి నుండి పంట నష్టాలను నివారించుకునేందుకు ముందస్తుగానే పంటలు విత్తుకోవడం ఎంతో శ్రేయస్కరం అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా రైతాంగానికి హితవు పలికారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల ప్రభావం నుండి పంటలను కాపాడుకోవాలంటే ముందస్తు పంటలకు వెళ్లడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.
మోస్రా మండల కేంద్రంతో పాటు వర్ని మండలం జలాల్ పూర్ గ్రామంలో శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. పై కార్యక్రమాలకు రైతులు ర్యాలీలుగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రైతు దినోత్సవం సందర్భంగా ప్రతీ చోట పండగ వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆలస్యంగా వరినాట్లు వేయడంతో అకాల వర్షాలు,వడగళ్ల వానల వల్ల చేతికొచ్చిన పంటలు దెబ్బతిని రైతులు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకృతి వైపరీత్యాలను నిలువరించే శక్తి ఎవరికీ లేదని, అయితే పంట సాగు కాలాన్ని కొంత ముందుకు జరుపుకుని నివారించుకోవచ్చని రైతులకు హితవు పలికారు. బాన్సువాడ, బోధన్ ప్రాంతాలకు చెందిన రైతులు కొంత ముందస్తుగానే పంటలు సాగు చేయడం వల్ల ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తక్కువ మేర నష్టం వాటిల్లిందని, ఇతర ప్రాంతాల్లో ఎక్కువ పంట నష్టం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వానాకాలం పంటలు మార్చి 15 లోపు, యాసంగి పంటలు జూన్ మొదటి వారంలోపు విత్తుకోవాలని సూచించారు.
ముందస్తుగా పంటలు వేయడం వల్ల దిగుబడులు తగ్గుతాయనే అభిప్రాయం సరికాదని, పైపెచ్చు అధిక దిగుబడులు, చీడపీడల నివారణ తక్కువగా ఉంటుందని, ఈ విషయంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు. ప్రస్తుత వానాకాలం పంట సాగుకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామని, రైతులు ఎలాంటి ఆదుర్దాకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఒకే పంట విధానం వల్ల చీడ పీడల బెడదతో దిగుబడులు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని, పంటల మార్పిడి విధానాన్ని పాటించాలన్నారు.
పంట మార్పిడిలో భాగంగా ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకమని, ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ, పెద్ద ఎత్తున రాయితీని అందజేస్తోందని కలెక్టర్ వెల్లడిరచారు.సకాలంలో నిజాంసాగర్ నీటి విడుదల తోపాటు నాణ్యమైన ఎరువులు,విత్తనాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నగేష్, తహశీల్దార్ విఠల్, ఎంపిడిఓ బషీరుద్దీన్, జెడ్పిటీసీ హరిదాసు, మండల రైతు సమన్వయ అధ్యక్షుడు సింగంపల్లి గంగారాం, సర్పంచ్ అనితా వెంకటీ గౌడ్, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.