నిజామాబాద్, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సురక్షా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం పోలీస్ శాఖలో ప్రవేశపెట్టిన మార్పులు, నూతన సంస్కరణలు, అధునాతన వసతుల గురించి ప్రజలకు వివరించేలా ప్రభుత్వ నిర్దేశానుగుణంగా కార్యక్రమాలను రూపొందించారు.
ముఖ్యంగా నేరాల నియంత్రణ, ప్రజలకు సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతో పోలీస్ శాఖకు ప్రభుత్వం సమకూర్చిన వాహనాలతో జిల్లా కేంద్రంలో పెట్రోలింగ్ కార్స్, బ్లూ కోల్ట్స్ పోలీస్ సిబ్బంది ర్యాలీ నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగనుంది. ఉదయం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శ్రీకారం చుట్టనున్న కార్యక్రమాలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేయనుండగా, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు.
పోలీస్ శాఖలో వచ్చిన మార్పులు, సాధించిన ఘనతలు, ప్రజలకు ఆ శాఖ చేరువైన తీరు గురించి వక్తలు వివరించనున్నారు. పోలీసు శాఖ పనితీరుపై అవగాహన కల్పించేందుకు వీలుగా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని సైతం చేపడుతున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్ లను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.