నిజామాబాద్, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోదావరి హారతి యాత్ర ప్రారంభ సందర్భంగా ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో ఇందూరు జిల్లా మరియు సంస్కృతి అనే అంశంపై నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్ బిఎల్‌ఎల్ గార్డెన్‌లో ప్రారంభ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గోదావరి మహాహారతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మురళీధర్ రావు మాట్లాడుతూ గోదావరి నది చరిత్ర తెలంగాణ ప్రాంతంలో పరివాహ ప్రదేశాల యొక్క అవగాహన అధ్యయనం కోసం యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.
గోదావరినది మానవజాతికి ప్రాణం పోసిందని, భవిష్యత్తులో గోదావరి కలుషితం కాకుండా చూడవలసిన బాధ్యత మనదే కాబట్టి చైతన్యవంతమైన సమాజం కోసం గోదావరి కాలుష్యం కాకుండా ఉండేందుకు యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే గంగా యమునా నదులు కలుషితమైనాయని, మన గోదావరి కలుషితం కాకూడదు మిగులు జలాలు ఉన్నాయని మనం పరిరక్షించుకోవాలని గోదావరి నది తెలంగాణ అస్తిత్వానికి ముడిపడి ఉన్నదని సమాజంలో చైతన్యం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
త్రివేణి సంగమమైన కందకుర్తి నుండి యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. సదస్సులో గోదావరి హారతి యాత్ర ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి ఎల్ వీరగోపాల్ యాత్ర ముఖ్య ఉద్దేశాలను వివరించారు. నరహరి మాట్లాడుతూ మధ్యప్రదేశ్లో నర్మదా నది యొక్క కాలుష్యాన్ని తగ్గించామని గోదావరి నది ద్వారా ఇరిగేషన్ రంగం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జిల్లా చరిత్రపై చరిత్రకారుడు కందకుర్తి ఆనంద్ వివరించారు. ప్రముఖ సామాజికవేత్త మాధవి లత ఆధ్యాత్మిక జీవన విధానాన్ని వివరించారు. ప్రజ్ఞాభారతి జిల్లా కో కన్వీనర్ పడగల దశరథ్ గంగా హారతి ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు రచ్చ తిరుపతి, మామిడ్ల గిరిధర్, రమేష్, న్యాయవాది పరిషత్ జిల్లా కార్యదర్శి జగన్మోహన్ గౌడ్, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్ వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు మేధావులు పాల్గొన్నారు.