తెలంగాణ పోలీస్‌ నెంబర్‌ వన్‌

నిజామాబాద్‌, జూన్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలుస్తున్నారని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ లో సురక్షా దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్‌ అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా విచ్చేయగా, జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు, ఆర్మూర్‌ శాసన సభ్యులు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, అదనపు డిసిపి మధుసూదన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణ, మెరుగైన పోలీసింగ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ శాఖకు సమకూర్చిన పెట్రో కార్స్‌, బ్లూ కోల్డ్స్‌ వాహనాలతో పోలీస్‌ సిబ్బంది నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ ఇతర అతిథులు జెండా ఊపి హెడ్‌ క్వార్టర్స్‌ నుండి ర్యాలీని ప్రారంభించారు.

ఎన్టీఆర్‌ చౌరస్తా, కలెక్టరేట్‌ గ్రౌండ్‌, ఓల్డ్‌ ఎల్‌ఐసి చౌరస్తా, ఫులాంగ్‌ చౌరస్తా, రాజ రాజేంద్ర థియేటర్‌ చౌరస్తా, వర్ని రోడ్డు చౌరస్తా, ఖిల్లా రోడ్‌, బోధన్‌ బస్టాండ్‌, నెహ్రూ పార్క్‌, గాంధీ చౌక్‌, న్యూ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ మీదుగా ర్యాలీ తిరిగి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కు చేరుకుంది. పోలీస్‌ వ్యవస్థ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఉపయోగించే అధునాతన సాధనాలు, ఆయుధాల గురించి సవివరంగా తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం అందరిని ఆకర్షించింది.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు నెలకొని ఉండడం ఎంతో అవసరమని అన్నారు. అప్పుడే పర్యాటకపరంగా, పారిశ్రామికంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలు ఉంటుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, సమకూరుస్తున్న అధునాతన వసతులతో తెలంగాణ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణకు అహరహం శ్రమిస్తున్నారని అన్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని హర్షం వెలిబుచ్చారు.

నేటి సమాజంలో కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలు చోటు చేసుకుంటుండగా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పోలీసులు సైతం నేరాల నియంత్రణకు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణలో పటిష్టమైన వ్యవస్థతో కూడిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం యావత్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోందని కలెక్టర్‌ అభినందించారు. అన్ని వర్గాల ప్రజలకు పూర్తిస్థాయిలో భద్రతను కల్పిస్తూ శాంతిభద్రతలు నెలకొని ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పోలీస్‌ శాఖకు అధునాతన సదుపాయాలను సమకూరుస్తోందన్నారు.

ఇందులో భాగంగానే పెట్రో కార్స్‌, బ్లూ కోల్డ్స్‌, జిల్లా స్థాయిలోనూ కమాండ్‌ కంట్రోల్‌ స్టేషన్స్‌, షీ టీమ్స్‌, భరోసా సెంటర్స్‌ వంటివి శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తున్నాయని అన్నారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా హరితహారం వంటి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల్లో క్రియాశీలకంగా మమేకం అవుతున్నారని, అనేక సామాజిక కార్యక్రమాల్లోనూ భాగస్వాములు అవుతున్నారని అన్నారు. అనునిత్యం 24 గంటల పాటు విధి నిర్వహణలో నిమగ్నమై ఉంటూ పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని ప్రశంసించారు.

జెడ్పి చైర్మన్‌, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులు యావత్‌ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని అన్నారు. కోవిడ్‌ సంక్షోభం సమయంలోను తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి పోలీసులు వెన్నుముకగా నిలుస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని నలుమూలలలో ఎక్కడ ఏ చిన్న నేరం జరిగినా, నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకొని క్లిష్టమైన కేసులను సైతం వెనువెంటనే చేదిస్తూ నేరస్తుల ఆటకట్టిస్తున్నారని అన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సింగపూర్‌, స్కాట్లాండ్‌, దుబాయ్‌ దేశాల తరహాలో స్థానిక పోలీస్‌ యంత్రాంగానికి అధునాతన సదుపాయాలను సమకూరుస్తోందని అన్నారు. ఇతరులకు వెలుగులు పంచుతూ కరిగిపోయే కొవ్వొత్తి తరహాలో పోలీసులు పండుగల సమయంలోనూ తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, అనుక్షణం శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో నిమగ్నమై ఉంటున్నారని కొనియాడారు.

ప్రతి ఒక్కరూ పోలీసులను గౌరవిస్తూ, వారు రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహించేలా సహకారం అందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, నిజామాబాద్‌ ఏసిపి కిరణ్‌ కుమార్‌, పోలీస్‌ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Blog heading and website banner of laptop with female typing hands, copy space in grey color. Concept of advertisement of bitcoin and cryptocurrency, modern technology and programming.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »