ఆర్మూర్, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిత్యం ప్రజలమధ్యే ఉంటూ వారితో మమేకమయ్యే పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవాలను పురస్కరించుకుని సోమవారం జరిగే విద్యుత్ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంకపూర్ నుంచి ఆర్మూర్ పట్టణానికి వెళ్తుండగా మార్గమధ్యంలో గల దోబీఘాట్ సమీపంలో ప్రమాదవశాత్తు రెండు వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. దీన్ని గమనించిన జీవన్ రెడ్డి వెంటనే తన వాహన శ్రేణిని అక్కడ నిలుపుదల చేయించి గాయపడ్డ వారికి ధైర్యం చెప్పారు.
క్షతగాత్రులలో ఒకరైన వృద్ధుడి వద్దకు వెళ్లి ‘‘తాతా మీకేమీ కాదు’’ అని ధైర్యం చెబుతూనే వెంటనే 108 అంబులెన్స్‌కి ఫోన్ చేసి చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. వెంటనే జీవన్ రెడ్డి వైద్యాధికారులకు ఫోన్ చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రుల పట్ల ఔదార్యం చూపి వారికి సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని స్థానిక ప్రజలు అభినందించారు.