నిజామాబాద్, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో వివిధ రంగాలలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని అవలోకనం చేసుకుంటూ, మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ విజయోత్సవ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.
ఇందులో భాగంగానే పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని చాటేందుకు వీలుగా మంగళవారం చేపట్టనున్న పారిశ్రామిక ప్రగతి ఉత్సవానికి నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టీఎస్-ఐపాస్ విధానం ద్వారా సింగిల్ విండో పద్ధతిలో అనుమతుల మంజూరీని సులభతరం చేసిన నేపధ్యంలో కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలు, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లభించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి వివరించనున్నారు.
ముఖ్యంగా రాష్ట్ర రాజధాని, మెట్రో నగరాలకే పరిమితమైన ఐ.టీ పరిశ్రమను జిల్లాలకు విస్తరించడం గ్రామీణ ప్రాంత యువతకు వరంగా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమీపంలో అన్ని అధునాతన హంగులతో నెలకొల్పిన ఐ.టీ హబ్ తుది దశ పనులను సైతం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి ముస్తాబు అయ్యింది. జిల్లాకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ, సంప్రదింపులతో ఇప్పటికే అనేక బహుళజాతి సంస్థలు నిజామాబాద్ ఐ.టీ హబ్ కేంద్రంగా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత తెలుపుతూ పరస్పర ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.
ఈ నేపధ్యంలో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పన జరుగనుంది. అలాగే, వ్యవసాయాధారిత జిల్లా కావడంతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో అనుకూలమైన వాతావరణం నెలకొని ఉండడం ఔత్సాహిక పారిశ్రామికులను ఆకర్షిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ రాయితీలు, ఇతరాత్ర తోడ్పాటును వినియోగించుకుంటూ పదుల సంఖ్యలో కొత్తగా రైస్ మిల్లులను నెలకొల్పారు.
ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ సైతం ఏర్పాటయ్యాయి. ఈ విషయాలను అధికారులు నేటి పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో తెలియజేస్తూ, పరిశ్రమ స్థాపనకు కొత్తగా ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు గురించి అవగాహన కల్పించనున్నారు.